సాయిబాబా జీవితమే ఒక సందేశం

వీక్షణం నవంబర్ 2024 సంచిక కోసం

సాయిబాబా జీవితమే ఒక సందేశం

తన జీవితం ద్వారా, పోరాటాల ద్వారా ప్రొ. జి ఎన్ సాయిబాబా సమాజానికి మొత్తంగానూ, బుద్ధిజీవులకు ప్రత్యేకంగానూ ఇచ్చిన సందేశం ఏమిటో వివరిస్తున్నారు ఎన్ వేణుగోపాల్ 

విప్లవ మేధావి, కవి, ప్రజా ఉద్యమాల మిత్రుడు ప్రొ. జి ఎన్ సాయిబాబా మరణం దిగ్భ్రాంతికరమైనది. అది కేవలం ఆరోగ్యకారణాల వల్ల, గాల్ బ్లాడర్ తొలగించడానికి జరిగిన శస్త్రచికిత్స తర్వాత తలెత్తిన సమస్యల వల్ల జరిగినది మాత్రమే కాదు. నిజానికి గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స లక్షలాది మందికో, కోట్లాది మందికో నిరపాయకరంగా జరుగుతున్నది. సాయిబాబాకు కూడా 2024 సెప్టెంబర్ 28న శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. శస్త్రచికిత్స తర్వాత ఐదు రోజుల పాటు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. శస్త్రచికిత్స జరిగిన చోట ఇన్ఫెక్షన్ వచ్చి, చీము పట్టడం ప్రారంభమై, దాన్ని కూడ విజయవంతంగా తొలగించారు. ఆ తర్వాత అక్కడే రక్తస్రావం మొదలై, అంతర్గత అవయవాలు ఒక్కొక్కటీ పని చేయడం మానేశాయి. అక్టోబర్ 12 రాత్రి 8.36 కు గుండె ఆగిపోయింది. 

ఈ అసహజ, అకాల మరణానికి పూర్తి కారణం పది సంవత్సరాలుగా నాగపూర్ సెంట్రల్ జైలులో అండా సెల్ లో ఉన్నప్పుడు తలెత్తిన ఎన్నో అనారోగ్య సమస్యలను జైలు అధికారులు, జైలు ఆస్పత్రి వైద్యులు సకాలంలో, సకమంగా పరిష్కరించకపోవడం, తాము పరిష్కరించలేకపోతే నాగపూర్ లోని పెద్ద ఆస్పత్రులకు తీసుకుపోక పోవడం, గత ఎనిమిది సంవత్సరాల కాలంలో అనేకసార్లు స్పృహ తప్పినప్పటికీ, రెండుసార్లు గుండెపోటు వచ్చినప్పటికీ తగిన సమయంలో తగిన చికిత్స అందించకపోవడం, నిర్లక్ష్యం వహించడం, తాత్సారం చేయడం వంటి అనేక చర్యలతో ప్రత్యేకించి జైలు వ్యవస్థ, వైద్య వ్యవస్థ, మొత్తంగా రాజ్యం సాయిబాబా శరీరాన్ని, సకల అవయవాలనూ ధ్వంసం చేసిపెట్టాయి. అలా పది సంవత్సరాల పాటు ధ్వంసమైపోయిన అవయవాలు ఏ చిన్న కుదుపునైనా తట్టుకునే శక్తిని కోల్పోయాయి. అందువల్ల ఇది గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స అనే ఒకానొక చర్యకు పర్యవసానం కాదు, పది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఉద్దేశపూర్వకంగా హంతక రాజ్యం సాగించిన హింసా ప్రక్రియకు పర్యవసానం.

సాయిబాబా అనే ఒకానొక వ్యక్తి మీద ఇంత హింసా ప్రక్రియను రాజ్యం ఎందుకు, ఎలా అమలు చేసిందో అర్థం చేసుకోవడానికి ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలి. 

జి ఎన్ సాయిబాబా (గోకరకొండ నాగ సాయిబాబా) పాత తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుత డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) అమలాపురం సమీపంలోని సన్నవిల్లి అనే చిన్న గ్రామంలో ఒక దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో 1967 జూలై 24న పుట్టాడు. తండ్రి సత్యనారాయణ మూర్తి, తల్లి సూర్యావతి లకు సాయిబాబా పెద్ద కొడుకు కాగా, ఆ తర్వాత చెల్లెలు గంగా భవాని, తమ్ముడు రామదేవుడు ఉన్నారు. సాయిబాబా ఇంకా పాఠశాలలో ప్రవేశించక ముందే, ఐదవ ఏట పోలియో వ్యాధికి గురై రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. నడవలేని కొడుకు ఆ లోపాన్ని చదువుతో తీర్చుకోవాలని తల్లి చాల శ్రద్ధ పెట్టారు. చిన్నప్పుడు, పెద్ద పెరుగుతున్నప్పుడు కూడా తన తల్లి తనను అమాంతం ఎత్తుకుని పాఠశాలకు తీసుకువెళ్లేదని, తన చదువు కోసమే ఊరు వదిలి అమలాపురం వచ్చి స్థిరపడ్డామని సాయిబాబా చాల సార్లు చెప్పాడు. అలా సూర్యావతి దృఢదీక్షతో, ఆమె కష్టంతో సాయిబాబా చదువు ప్రారంభించి, కొనసాగించాడు. కుటుంబ ఆర్థికస్థితి, అంగవైకల్యం సవాళ్లను ఎదిరిస్తూ జీవిత పోరాటంలో విజేతగా, విద్యలో అత్యంత ప్రతిభావంతుడిగా నిలిచాడు. 

ఎంఎ (ఇంగ్లిష్) చదువు కోసం 1987లో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశించిన సాయిబాబా అప్పుడు కొనసాగుతుండిన ‘ఆట-పాట-మాట బంద్’ నిర్బంధం వల్ల దాదాపు అజ్ఞాతంగా పని చేస్తున్న విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రభావంలో ప్రజా జీవితంలో ప్రవేశించాడు. వైద్య పరిభాషలో 90 శాతం అంగ వైకల్యం ఉన్న వ్యక్తి అయినా సామాజిక ఉద్యమాల పట్ల కుతూహలంలో, ఉద్యమాలలో పాల్గొనాలనే స్ఫూర్తిలో సగటు విద్యార్థులందరినీ మించిపోయాడు.  1990 జనవరి తర్వాత విప్లవోద్యమానికీ, ప్రజాసంఘాలకూ వెసులుబాటు వచ్చి బహిరంగ కార్యక్రమాలు పునఃప్రారంభమయ్యాక ప్రజా ఉద్యమాలలో నేరుగా పాల్గొనాలనే ఆయన తపన నెరవేరింది. అప్పుడే తన చిన్ననాటి నెచ్చెలి వసంతతో సహజీవనం ప్రారంభించాడు. సెంట్రల్ యూనివర్సిటీ ఎం ఫిల్ విద్యార్థిగా ఉంటూ ఆ ఆగస్టులో మండల్ కమిషన్ సిఫారసుల అమలు కోసం, బహుజనుల రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాడు. 

సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (సీఫెల్ – ప్రస్తుతం ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ – ఎఫ్లు) లో పి జి డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లిష్ (పిజిడిటిఇ) అనే ఒక సంవత్సరం కోర్సు చేస్తే ఉద్యోగం సులభంగా వస్తుందనే ఆలోచనతో, సెంట్రల్ యూనివర్సిటీ ఎం ఫిల్ వదిలేసి అక్కడ చేరాడు. అక్కడ ఉన్న సంవత్సరంలో రోజు కూలీ మీద పని చేస్తున్న తాత్కాలిక మెస్ వర్కర్ల సమస్యలు తెలుసుకొని, వారిని పర్మనెంట్ చేయించడం కోసం ఉద్యమం ప్రారంభించి విజయం సాధించాడు. ఆ ఒకటి రెండు సంవత్సరాల కాలంలోనే కొద్దికాలం వరంగల్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ లో, కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తాత్కాలిక ఉద్యోగాలు చేశాడు, పి ఎచ్ డి చేయడానికి అవసరమైన యుజిసి నెట్ పాసయి, జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్ పొంది, సీఫెల్ లోనే పి ఎచ్ డి లో చేరాడు. కాని ఆ పి ఎచ్ డి పూర్తి చేయకుండానే, విప్లవ రాజకీయాల అభినివేశం మరింత పెంచుకుని విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా చేరాడు. అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక (ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం – ఎ ఐ పి ఆర్ ఎఫ్) రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. 1993-94ల్లో సికిందరాబాద్ ఇన స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీలో లెక్చరర్ గా ఉద్యోగంలో చేరాడు. 

1995లో ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఖైదీల సౌకర్యాలు మెరుగు పరచాలని, ఖైదీల హక్కులు కాపాడాలని, అప్పటికి చంచల్ గూడ జైలులో ఉన్న పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణల నాయకత్వంలో నక్సలైట్ ఖైదీలు ప్రారంభించిన ఉద్యమానికి బైట సమాజంలో సంఘీభావ ఉద్యమం నిర్మించి, నాయకత్వం వహించాడు. తర్వాత ఎ ఐ పి ఆర్ ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయి, సామ్రాజ్యవాద దోపిడీ పీడనల కింద దేశంలోనూ, అంతర్జాతీయంగానూ జాతుల సమస్య నానాటికీ ఎంత తీవ్రతరంగా మారుతున్నదో గుర్తించి జాతుల సమస్యపై 1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో చరిత్రాత్మకమైన అంతర్జాతీయ సదస్సు నిర్వహించాడు. ఆ సదస్సులో చర్చకు వచ్చిన పత్రాలన్నిటినీ సమీకరించి ‘సింఫనీ ఆఫ్ ఫ్రీడం’ అనే ఆలోచనాప్రేరకమైన పుస్తకం వెలువరించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకవర్గాల కింద ప్రాంతీయ వివక్షకూ, హక్కుల అణచివేతకూ, అన్యాయానికీ గురైన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడాలని, అందుకోసం ప్రజా ఉద్యమం నిర్మించాలని ఆలోచించి మొదటి అడుగుగా వరంగల్ లో  ఎ ఐ పి ఆర్ ఎఫ్ నిర్వహణలో ప్రజాస్వామిక తెలంగాణ సదస్సు నిర్వహించాడు.  ఆ సదస్సు తెలంగాణ ప్రజల నిజమైన ఆకాంక్షల ప్రకటన అయిన చరిత్రాత్మక ‘వరంగల్ డిక్లరేషన్’ ను విడుదల చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన మీద ప్రపంచ బ్యాంకు ఆదేశాలు సాగుతున్న సందర్భంలో 1998లో  ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం నిర్మించాడు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద కోత విధించినప్పుడు, సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం ఉద్యమం నిర్మించాడు. ఆ తర్వాత ఢిల్లీకి మారడంతో సాయిబాబా కార్యక్షేత్రం విస్తరించింది. వివిధ రాష్ట్రాల నుంచి తమ సమస్యల మీద పోరాటాల కోసం ఢిల్లీ వచ్చే విభిన్న రాష్ట్రాల ప్రజా సమూహాలతో సంబంధంలోకి రావడం మాత్రమే కాదు, ఆయా సమూహాల మధ్య సమన్వయం కుదిర్చే వేదికగా, సంఘీభావ కేంద్రంగా మారాడు. 

2003లో ఢిల్లీలో రాంలాల్ ఆనంద్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు. సరిగ్గా అప్పుడే మధ్య భారత అరణ్యాలలో అత్యంత విలువైన ఖనిజ నిలువలను కార్పొరేట్లకు అప్పగించడం కోసం అక్కడి ఆదివాసులను వెళ్లగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదివాసుల ప్రతిఘటనకు మావోయిస్టులు వెన్నుదన్నుగా ఉన్నారని, అందువల్లనే కార్పొరేట్లతో ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందాలు అమలులోకి తెచ్చే అవకాశం లేకుండా పోతున్నాడని, స్వయంగా అప్పటి భారత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ‘మావోయిస్టులు భారతదేశపు ప్రధాన అంతర్గత సమస్య’ అని ప్రకటించాడు. సల్వా జుడుం పేరుతో ప్రజల మీద యుద్ధం ప్రారంభించాడు. 

మావోయిస్టు పార్టీ మీద దాడి ఆదివాసుల మీద కార్పొరేట్ యుద్ధంలో భాగమే అని సాయిబాబా గుర్తించాడు. అంతకు ముందే హైదరాబాదులో సామ్రాజ్యవాద వ్యతిరేక వేదికను నిర్మించిన అనుభవంతో, ఈ ప్రజల మీద యుద్ధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించాడు. అందులో భాగంగానే ముంబై రెసిస్టెన్స్ 2004 పేరుతో దేశంలోని ప్రజా ఉద్యమాలన్నిటినీ ఒకే వేదిక మీద ఐక్యం చేసే బృహత్తర ప్రయత్నం చేశాడు. సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ దేశదేశాలలో ప్రచారం చేశాడు. రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ నిర్మించాడు. ఒకవైపు సల్వాజుడుం చట్ట వ్యతిరేకమనీ, రాజ్యాంగ వ్యతిరేకమనీ సుప్రీంకోర్టు తీర్పు చెపుతుండగా, మరొకవైపు కేంద్ర ప్రభుత్వం ఆ యుద్ధానికే ఆపరేషన్ గ్రీన్ హంట్ అని కొత్త పేరు పెట్టింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా సాయిబాబా దేశమంతటా, విదేశాలలోనూ సంఘీభావాన్ని కూడగట్టాడు. 2014 మేలో అరెస్టయ్యే వరకూ ఆ పనిలోనే ఉన్నాడు.    

ఈ విస్తారమైన పోరాట జీవిత క్రమంలో సాయిబాబా విప్లవ రచయితల సంఘం, అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక, జాయింట్ ఆక్షన్ కమిటీ ఫర్ డెమోక్రటిక్ రైట్స్, ఫోరం అగెనెస్ట్ ఇంపీరియలిస్ట్ గ్లోబలైజేషన్, రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఫోరం అగెనెస్ట్ వార్ ఆన్ పీపుల్, కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్, ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీపుల్స్ స్ట్రగుల్స్, పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్ మెంట్ వంటి ఎన్నో సంస్థలలో సభ్యుడిగా, కార్యకర్తగా, నాయకుడిగా, సలహాదారుగా పని చేశాడు. పీపుల్స్ రెసిస్టెన్స్, జన్ ప్రతిరోధ్, ఉద్యమం వంటి అనేక పత్రికలు నడిపాడు. ఎన్నో పత్రికల్లో రచనలు చేశాడు, ప్రచార సాధనాలలో గళం వినిపించాడు. దేశదేశాలలో ఎన్నోచోట్ల ఉపన్యాసాలు ఇచ్చాడు. ఢిల్లీలో దేశవ్యాప్త ప్రజా ఉద్యమాల వ్యాఖ్యాతగా, ప్రతినిధిగా, సమాచార కేంద్రంగా, వారధిగా నిలిచాడు. 

అలా భారత ప్రభుత్వం ప్రజల మీద సాగిస్తున్న యుద్ధం గురించి ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగానూ, అంతర్జాతీయంగానూ తెలియజెపుతున్నాడు గనుకనే, దానికి ప్రతిఘటనను కూడగట్టడంలో అగ్రభాగాన నిలిచాడు గనుకనే భారత రాజ్యం సాయిబాబా మీద కక్ష పూనింది. ఆయన గళం వినిపించకుండా చేయాలని కుట్రలూ కుహకాలూ మొదలయ్యాయి. ఆనాటి హోమ్ మంత్రి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సాయిబాబా పేరు ప్రస్తావించి పాలకవర్గాల కక్షను వ్యక్తం చేశాడు. చివరికి 2013 సెప్టెంబర్ లో యూపీఏ ప్రభుత్వపు చివరి రోజులలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఒక అబద్ధపు కేసు సృష్టించి, ఢిల్లీలో సాయిబాబా ఇంటి మీద దాడి చేసి, ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలు, తన పరిశోధనా సమాచారం ఎత్తుకుపోయారు. 2014 మేలో మనిషినే ఎత్తుకుపోయి, పాండు నరోటే, మహేష్ టిర్కి, విజయ్ టిర్కి, ప్రశాంత్ రాహీ, హేమ్ మిశ్రాలతో కలిపి ఆ అబద్ధపు కేసులో నిందితుడిగా చూపి నిర్బంధించారు. ఏడాది తర్వాత బెయిల్ మీద కొద్ది కాలం బైట ఉండగలిగినప్పటికీ, 2017 మార్చ్ 7న గడ్చిరోలి సెషన్స్ కోర్టు అత్యంత దుర్మార్గంగా సాయిబాబాకూ మరి నలుగురికీ యావజ్జీవ శిక్ష, ఒకరికి పది సంవత్సరాల శిక్ష విధించింది. ఆ తీర్పు మీద అప్పీలు వినడానికి హైకోర్టు ఐదు సంవత్సరాలు తాత్సారం చేసింది. అలా యావజ్జీవ శిక్ష పడిన ఖైదీగా ఏడు సంవత్సరాల పాటు సాయిబాబాను అండా సెల్ లో నిర్బంధించి, అత్యవసరమైన ఆరోగ్య సేవలు అందకుండా చేసింది. అప్పీలు విచారణ పూర్తి కాకుండానే కాలేజీ యాజమాన్యం ఉద్యోగం తొలగించింది. పోలీసు అధికారులు, జైలు అధికారులు, ఆస్పత్రి అధికారులు, కాలేజీ యాజమాన్యం, న్యాయవ్యవస్థ అందరికందరూ సాయిబాబాను, వేధించడంలో, హత్య చేసే కుట్రలో భాగమయ్యారు. 

చివరికి అసలు కేసు పెట్టడానికి, అరెస్టు చేయడానికి అవసరమైన ప్రాథమిక చట్టబద్ధ అనుమతులే లేవనే సాంకేతిక  కారణంతో 2022 అక్టోబర్ లో బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ కేసును కొట్టివేసి ఆరుగురు నిందితులూ నిర్దోషులని ప్రకటించింది. కాని అప్పటికే పాండు నరోటే జైలులోనే మరణించాడు. నిర్దోషిగా నిర్ధారణ కాకముందే ఆయన మీద మరణశిక్ష అమలయింది. ఆ తీర్పు వచ్చిన కొద్ది గంటలలోనే ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి, అసాధారణంగా శనివారం న్యాయమూర్తులను కూచోబెట్టి, స్టే తీసుకువచ్చింది. ఆ స్టే మీద ఏడాది తర్వాత సుప్రీం కోర్టు, మళ్లీ నాగపూర్ బెంచిలోనే మెరిట్ మీద విచారణ జరగాలని అంది. చివరికి నాగపూర్ బెంచి 2024 మార్చ్ లో సాంకేతిక కారణాల రీత్యానూ, మెరిట్ రీత్యానూ ఈ కేసు చెల్లదని, నిందితులందరూ నిర్దోషులని తీర్పు చెప్పింది. అలా నిర్దోషిగా తేలినప్పటికీ ఎనిమిదిన్నర సంవత్సరాలు అక్రమ నిర్బంధంలో ఉండి, 2024 మార్చ్ 7న సాయిబాబా విడుదలయ్యాడు. అప్పటినుంచి గడిచిన ఏడు నెలల్లో నాలుగు నెలల పైనే ఆస్పత్రుల చుట్టూ తిరగడమే సరిపోయింది. చివరికి అక్టోబర్ 12న అతి చిన్న కారణంతో మరణం సంభవించింది. 

సామాజిక ప్రాధాన్యత ఉన్న వ్యక్తులు మరణించినప్పుడు ‘జీవితమే పోరాటం’, ‘జీవితమే సందేశం’ అనే మాటలు వినబడుతుంటాయి గాని, అందులో అత్యధికం అతిశయోక్తులే. సాయిబాబా విషయంలో మాత్రం అవి అక్షరాలా నిజాలు. ఆయన జీవితమంతా నిజంగా పోరాటమే. జీవితాంతమూ పోలియో అంగవైకల్యంతో పోరాడాడు. చిన్ననాట కుటుంబ ఆర్థిక పరిస్థితితో పోరాడాడు. హైదరాబాదు చేరిన నాటి నుంచీ వ్యవస్థలతో విశాల పోరాటంలో భాగమయ్యాడు. పది సంవత్సరాలుగా పోలీసులతో, జైలు అధికారులతో, ఆస్పత్రి అధికారులతో, న్యాయవ్యవస్థతో, యూనివర్సిటీ అధికారులతో పోరాడక తప్పలేదు. ఆయన జీవితమూ పోరాటాలూ విజయాలూ వైఫల్యాలూ తప్పనిసరిగా సమాజానికి పాఠాలు నేర్పుతాయి. అలా ఆయన జీవితమే ఒక సందేశం. ఆ సందేశాన్ని ఐదు రకాలుగా గుర్తించవచ్చు. 

మొదటిది, ఒక వ్యక్తి సమాజానికి తన శక్తి మేరకు ఉపయోగపడాలనుకుంటే శారీరక లోపాలూ అంగవైకల్యమూ అడ్డంకి కాజాలవు అనే సందేశం. మామూలుగా ఎటువంటి శారీరక లోపాలు, అంగ వైకల్యాలు లేని మనుషులు కూడ సమాజానికి తాము చేయవలసినది ఉంటుందనే అనుకోకపోవడం, అనుకున్నా చేయగలిగినంత చేయకపోవడం సాధారణమైన సమాజం మనది. అటువంటి చోట సాయిబాబా ప్రజా జీవితంలో గడిపిన ముప్పై ఏడు, ముప్పై ఎనిమిది సంవత్సరాలు నిరంతరమూ సమాజానికి, ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ గడిపాడు. మరొక మనిషి లేకుండా ప్రయాణం చేయడం కష్టసాధ్యమైనా దేశంలో అనేక చోట్లకు తిరిగాడు, విదేశాలకు వెళ్లాడు, ఆలోచించాడు, చదివాడు, రాశాడు, విభిన్న ప్రజా ఉద్యమాలను కలిసి, వాటి మధ్య వారధి ఏర్పరచాడు, ఐక్యసంఘటనలు నిర్మించాడు. ప్రతికూల పరిస్థితుల మధ్యనే ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా ప్రజా ఉద్యమాలకు సానుకూలతను అన్వేషించాడు.

రెండవది, ఒక వ్యక్తికి అవకాశాలూ శక్తి సామర్థ్యాలూ సానుకూలతలూ ఉన్నా లేకపోయినా కాలమూ చరిత్రా, సమాజమూ ఒక్కోసారి ఆ వ్యక్తి ముందర బృహత్తర కర్తవ్యాలను పెడతాయి. ఆ సందర్భానికి లేచి నిలబడతారా లేదా, అవసరమైన శక్తి సామర్థ్యాలను సంతరించుకుని ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తారా లేదా అని పరీక్ష పెడతాయి. ఆ పరీక్షకు తట్టుకుని లేచి నిలబడి, శక్తి సామర్థ్యాలు సంపాదించుకుని, ఆ కర్తవ్యాన్ని నిర్వహించినవారు చరిత్రకు ఎక్కుతారు. చరిత్ర గమనపు మూలమలుపుల్లో మార్గ నిర్దేశక, నాయకత్వ పాత్ర వహిస్తారు. సాయిబాబా నిర్వహించిన పాత్ర అటువంటిది. బహుజన విద్యార్థి ఆందోళన నుంచి, జైలు ఖైదీల ఆందోళన నుంచి, ప్రపంచీకరణ వ్యతిరేక  ఆందోళన నుంచి, విభిన్న ప్రజా ఉద్యమాల సమన్వయ వేదిక నిర్మాణం నుంచి, ప్రజల మీద రాజ్యం జరుపుతున్న దుర్మార్గ యుద్ధానికి వ్యతిరేకంగా దేశాదేశాల ప్రజాబిప్రాయాన్ని సమీకరించే విశాల ఉద్యమం దాకా సాయిబాబా కాలం, చరిత్ర, సమాజం తననుంచి ఏమి కోరితే అది చేయడానికి తనను తాను సిద్ధంగా పెట్టుకున్నాడు. ఎప్పటికప్పుడు విభిన్న ప్రజా ఉద్యమాలతో, సంఘీభావం, భాగస్వామ్యం, నాయకత్వం నిర్వహించాడు. 

మూడవది, అస్తిత్వవాదం ప్రకటించే పరిమితులను సాయిబాబా తన జీవితాచారణ ద్వారా అధిగమించి చూపాడు. పుట్టుకే సమస్తాన్నీ నిర్ణయిస్తుందనీ, ఒక తలంలో పుట్టినవారు ఇతర తలాలలో పనిచేయగూడదనీ, చేయలేరనీ కొన్ని దశాబ్దాలుగా అస్తిత్వవాద మేధావులు ముందుకు తెస్తున్న వాదనలు తప్పు అని సాయిబాబా తన జీవితం ద్వారా రుజువు చేశాడు. కోస్తాంద్రలో పుట్టి తెలంగాణ కోసం పని చేశాడు. పుట్టుకతో దళితుడూ ఆదివాసీ ముస్లిమూ కాకపోయినా ఆ వర్గాల కోసం పని చేశాడు. అన్నిటికీ మించి రాజ్య నిర్బంధానికీ, హింసకూ గురవుతున్న ఆదివాసుల పక్షాన నిలబడి, ఆదివాసులతో మమేకమయ్యాడు. అంటే ప్రాంతం, కులం, మతం, ఆర్థిక, ఉద్యోగ స్థితి వంటి అస్తిత్వాలు తనకు విధించిన పరిమితులన్నిటినీ తోసి రాజని ప్రజల కోసం పని చేశాడు. ఆ చైతన్యానికీ ఆచరణకూ మూల కారణం ఆయన మూడు దశాబ్దాలకు పైగా నమ్ముతున్న, పాల్గొంటున్న నిర్దిష్ట రాజకీయ విశ్వాసాలలో ఉన్నది.     

నాలుగవది, భిన్నాభిప్రాయాలు ప్రకటించేవారి పట్ల, ప్రత్యామ్నాయ ఆచరణలో ఉన్నవారి పట్ల రాజ్యం ఎంత క్రూరంగా, అమానుషంగా ప్రవర్తించగలదో సాయిబాబా జీవితం నిరూపిస్తుంది. అబద్ధపు కేసు, అన్యాయమైన శిక్ష, బెయిల్ నిరాకరణ, వైద్య చికిత్సల నిరాకరణ, ఆలస్యం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా ఆరోగ్యం ధ్వంసం చేయడం, తల్లి అనారోగ్యానికీ, మరణానికీ కూడా పెరోల్ ఇవ్వకపోవడం, ఉద్యోగం నుంచి తొలగింపు, వికలాంగుడని కూడ చూడకుండా శరీరం ధ్వంసమయ్యేలా పోలీసుల ప్రవర్తన, ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం, చట్టం పట్ల, మానవత్వం పట్ల గౌరవం లేని న్యాయమూర్తుల ప్రవర్తన, ప్రతి వ్యవస్థ మీద పోలీసుల ఆధిపత్యం, సంఘ్ పరివార్ శక్తుల విద్వేష ప్రచారం – ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం సాయిబాబా మీద కత్తిగట్టింది, కక్ష పూనింది. ఈ సమాజంలో ఒక బుద్ధిజీవి ప్రజల పట్ల తన బాధ్యత నిర్వర్తించాలనే నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఉంటే రాజ్యం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో చూపింది. అలా రాజ్య స్వభావం హింస అనే మార్క్సిస్టు సూత్రీకరణను సాయిబాబా తన జీవితంలో అనుభవించిన నిర్బంధం ద్వారా రుజువు చేశాడు. 

ఈ రాజ్యహింస సాయిబాబా అనే వ్యక్తి మీద మాత్రమే సాగినది కాదు, సాయిబాబా నమ్మిన విశ్వాసాల మీద, విలువల మీద సాగిన దాడి అది. అందువల్లనే భీమా కోరేగాం కేసులో కనీసం నలుగురు నిందితుల మీద సాయిబాబాను సమర్థించారనే ఆరోపణ కూడా చేశారు. స్వయంగా సాయిబాబా కేసు వాదించిన న్యాయవాదిని భీమా కోరేగాం కేసు నిందితుడిగా చూపారు. వీటన్నిటినీ మించి సాయిబాబా సహ నిందితుడు, ఆదివాసి పాండు నరోటేకు అతి మామూలు అనారోగ్యానికి సరైన సమయంలో సరైన చికిత్స చేయించకుండా మరణానికి కారణమయ్యారు. ఆ విధంగా సాయిబాబా జీవితమూ ఆచరణా, సాయిబాబా మీద పెట్టిన కేసూ రాజ్య హింసకూ హంతక స్వభావానికీ అద్దం పడుతున్నాయని చూపడమే సాయిబాబా సందేశం.    

అయిదవది, సాయిబాబా జీవితం ద్వారా, ఆచరణ ద్వారా మాత్రమే కాదు, మరణానంతర జీవితం ద్వారా కూడా సందేశం ఇస్తున్నాడు. తన జీవితమంతా విభిన్న సమూహాల ప్రజలను ఒకే వేదిక మీదికి తేవడం, విభిన్న ప్రజా ఉద్యమాల మధ్య సమన్వయం సాధించడం, ఎటువంటి కష్టతరమైన పరిస్థితులలోనైనా పని కొనసాగించడం అనే విలువలకు కట్టుబడి ఉండిన సాయిబాబా అక్టోబర్ 12న మరణించిన తర్వాత కూడా ఆ పనులను కొనసాగించాడు. అక్టోబర్ 14న మృతదేహాన్ని ప్రజల చివరిచూపు కోసం సోదరుడి ఇంటి దగ్గర ఉంచినప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అయిదారు గంటల్లో ఐదారు వేల మంది అక్కడికి వచ్చారు. ఆ సందర్శకులు వేరువేరు వయసుల, వేరు వేరు రాజకీయాభిప్రాయాల, వేరు వేరు ప్రాంతాల వాళ్లు. సాయిబాబా అరెస్టుకు ముందు ఎన్నెన్ని వర్గాలను సమీకరించాడో, ఆయన అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా ఎవరెవరు గొంతెత్తారో, రాజ్య క్రూరత్వాన్ని ఎవరెవరు ఖండించారో వాళ్లందరూ అక్కడ ఆయనను చివరిసారి చూడడానికి వచ్చారు. అలాగే హైదరాబాదులో పదకొండు సంవత్సరాలుగా ఊరేగింపులకు, విప్లవ నినాదాలకు అవకాశం లేని చోట, సాయిబాబా మృతదేహపు ఊరేగింపులు ఉత్తేజకరంగా జరిగాయి. ఆయన జీవిత పర్యంతం చేసిన కృషినే మరణానంతరం కూడ కొనసాగించాడు. 

అయితే ఈ సందేశాలన్నీ సాయిబాబా అనే వ్యక్తి మరణానికి స్పందనగా మాత్రమే మిగిలితే సరిపోదు. సాయిబాబా జీవితంలో చివరి ఇరవై సంవత్సరాలు ప్రధానంగా కేంద్రీకరించినది భారత ప్రజల మీద భారత ప్రభుత్వం, పాలకవర్గాలు సాగిస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకించడం మీద. ఆ యుద్ధానికి వ్యతిరేకంగా విశాలమైన నిరసన, ప్రతిఘటన కూడగట్టడానికి ఆయన ప్రయత్నించాడు. ఆయన ప్రజలపై యుద్ధానికి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆ యుద్ధం పేరు సల్వా జుడుం, ఆపరేషన్ గ్రీన్ హంట్. ఆయనను జైలుకు పంపిన తర్వాత ఆ యుద్ధానికి కొత్త పేర్లెన్నో వచ్చాయి. ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ ప్రహార్ లాంటి తక్షణ, స్వల్పకాలిక, మధ్యంతర యుద్ధ చర్యలన్నీ ముగిసిపోయి, ఇప్పుడు గత సంవత్సరంగా ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే “అంతిమ చర్య”కు పూనుకున్నది. గడిచిన పది నెలల్లో రెండువందల మందికి పైగా సాయుధ కార్యకర్తలను, నిరాయుధ ఆదివాసులను హత్య చేసింది. మధ్య భారత అరణ్యాల నుంచి ఆదివాసులను వెళ్లగొట్టి, ఆదివాసులకు మద్దతుగా ఉన్న మావోయిస్టులను నిర్మూలించి, ఆ అడవులను, అక్కడి భూగర్భంలో దాగిన విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు, దళారీలకు, సామ్రాజ్యవాద బహుళ జాతి సంస్థలకు అప్పగించడం భారత పాలకవర్గాల, ప్రభుత్వాల లక్ష్యం. అది కేవలం ఆదివాసుల సమస్యో, మావోయిస్టుల సమస్యో మాత్రమే కాదు, ఈ దేశ సంపద ఇతరులు కొల్లగొట్టుకుపోకుండా కాపాడాడానికి, భవిష్యత్ తరాలకు వారసత్వ సంపద మిగల్చడానికి సంబంధించిన సమస్య. 

సాయిబాబా జైలుకు వెళ్లేవరకూ మాత్రమే కాదు, విడుదలై వచ్చిన ఈ ఏడు నెలల్లో కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాడు. మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతి సందర్భాన్నీ ఆ వ్యతిరేకత ప్రకటించడానికి, ప్రతిఘటన కూడగట్టడానికి ఉపయోగించుకున్నాడు. ఆ యుద్ధ వ్యతిరేక ప్రజా ఐక్య సంఘటన నిర్మాణం కోసమే తన ఆరోగ్యం త్వరగా బాగుచేసుకోవాలని తహతహలాడాడు. అంటే ఆదివాసులపై పాలకవర్గాలు సాగిస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకించడమే, వ్యతిరేకించే వారందరి ఐక్యతను సాధించడమే సాయిబాబాకు ఇవ్వగల నివాళి. 

(రచయిత వీక్షణం సంపాదకుడు)


Box

వీక్షణంలో సాయిబాబా 

జనవరి 2017 - ఆంగ్ల నవలల్లో ఉత్పత్తి సంబంధాల ప్రతిఫలనం – జి ఎన్ సాయిబాబా 


వీక్షణంలో సాయిబాబా నిర్బంధం పై 

జూన్ 2014 - సాయిబాబా నిర్బంధం – భవిష్యత్తు సూచనలు – వి. కడలి

జూన్ 2015 – సాయిబాబాపై కొనసాగుతున్న నిర్బంధం – పి. వరవరరావు 

ఏప్రిల్ 2017 – అబద్ధాల కేసులో అన్యాయమైన తీర్పు – ఎన్ వేణుగోపాల్ 

డిసెంబర్ 2017 – సాయిబాబా నిర్బంధం – అనవసర వివాదం – జి లింగమూర్తి 

నవంబర్ 2022 – సాయిబాబా కేసులో హైకోర్టు X సుప్రీంకోర్టు – జస్టిస్ మదన్ బి లోకూర్ 

డిసెంబర్ 2022 – పాలకులను భయపెడుతున్న మెదడు, కలం – వర్డిల్ 

ఏప్రిల్ 2024 – సాయిబాబా, తదితరుల మీద కేసు, శిక్షలు చెల్లవు – హైకోర్టు తీర్పు